Telangana: రైతులకు తీపికబురు చెప్పిన మంత్రి తుమ్మల
తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది
By Srikanth Gundamalla Published on 5 May 2024 4:30 AM GMTTelangana: రైతులకు తీపికబురు చెప్పిన మంత్రి తుమ్మల
తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. జొన్నల కొనుగోలు విషయంలో నిబంధనలను సడలించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ మేరకు జొన్నలు పండించిన రైతులకు మరింత వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ట పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్క్‌ఫెడ్‌ను ఆదేశించారు. జొన్న రైతులు ఎవరూ తొందరపడి తక్కువ ధరకే పంటను అమ్ముకోవద్దని ఆయన సూచించారు. పెంచిన పరిమితి ప్రకారం ప్రభుత్వం జొన్న రైతుల వద్ద నుంచి మద్దతు ధరకు జొన్నలను కొనుగోలు చేస్తుందని మంత్రి తుమ్మల ప్రకటించారు.
కాగా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు 8 .85 క్వింటాళ్ల జొన్నలను కొనాలని ఐదేళ్ల క్రితం పరిమితిని విధించింది. అయితే.. తాజాగా పంట దిగుబడులు పెరిగాయనీ.. అందుకే ప్రభుత్వం పరిమితిని పెంచాలని పలువురు రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన జొన్న రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపారు. ఈ మేరకు వారి విన్నపంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అధికారుల నుంచి నివేదికలను తెప్పించుకుని ఆ తర్వాత 12 క్వింటాళ్లకు పెంచుతూ ఆదేశాలను జారీ చేసింది. కాగా.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 1.05 లక్షల ఎకరాల్లో జొన్న పంటను గత అక్టోబర్ నుంచి మార్చి వరకు రబీ సీజన్‌లో రైతులు పంట పండించారు.