ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటి వరకు రూ.1435 కోట్లు చెల్లించినట్టు అధికారులు తెలిపారు. నిన్న 13,841 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.146.30 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.15 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం అయ్యాయని చెప్పారు. 1.29 లక్షల ఇళ్లు పురోగతిలో ఉన్నాయన్నారు. వీటిలో సుమారు 20 వేల ఇళ్లు గోడల దశలో, 8,633 ఇళ్లు పైకప్పు దశలో ఉన్నాయని గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతమ్ వెల్లడించారు. పలుచోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని, లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారని తెలిపారు.
ఇంటి నిర్మాణ పురోగతిని బట్టి ప్రతి సోమవారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమచేస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా గత సోమవారం 13,841 మంది లబ్ధిదారులకు రూ.146.30 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఇళ్లను వేగంగా పూర్తి చేసుకునేందుకు వీలు కలుగుతోందని వివరించారు. అటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరం అయ్యే ఇసుకను తక్కువ ధరకే అందించాలని, లబ్ధిదారులపై ఆర్థిక భారం దించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆదేశాలు రావడంతో జిల్లాలో గృహ నిర్మాణ శాఖ కార్యాచరణ సైతం చేపట్టింది.