తెలంగాణలో ఎంసెట్ రాయాలనుకుంటున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎంసెట్ దరఖాస్తు గడువు పెంచినట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. జూన్ 24 వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కోసం 2 లక్షల 25 వేల 125 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని.. అగ్రికల్చర్ బీఎస్సీ కోసం 75 వేల 519 మంది దరఖాస్తు చేసుకున్నారని గోవర్ధన్ చెప్పుకొచ్చారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 24 వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు గోవర్ధన్ వెల్లడించారు. ఈ పరీక్ష దరఖాస్తు గడువు మే 18న ముగియాల్సి ఉండగా జూన్ 24 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ఎంసెట్ పరీక్షను ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జెఎన్‌టీయూ నిర్వహిస్తోంది. ఎంసెట్ పరీక్షలు జూలై 5 నుంచి 9 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) మోడ్ ఆధారంగా నిర్వహించనున్నారు. పరీక్షలు మొత్తం 9 సెషన్లలో నిర్వహించనున్నారు. అగ్రికల్చర్ వారికి 3, ఇంజినీరింగ్ వారికి 5 సెషన్లు, మరో సెషన్‌ను అవసరాన్ని బట్టి నిర్వహించనున్నట్లు జెఎన్‌టీయూ వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మరలా తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు చివరి వారంలో ఫలితాలు ప్రకటించే అవకాశాలు ఉండగా.. సెప్టెంబర్ 15 నాటికి అడ్మిషన్స్ పూర్తిగా చేపట్టాలని భావిస్తున్నారు.