తెలంగాణ ఆర్టీసీ బస్సులో కోడికి టికెట్ కొట్టారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. గోదావరిఖని నుంచి కరీంనగర్ వెళ్తుంది. అయితే మహమ్మద్ అలీ అనే ప్రయాణికుడు కరీంనగర్ కు వెళ్లేందుకు వెంట తెచ్చుకున్న కోడిపుంజు తో ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అలీ వద్ద కోడి పుంజు ఉండటాన్ని గమనించిన బస్సు కండక్టర్ దానికి కూడా టికెట్ కొట్టాడు. రూ. 30 రూపాయల టికెట్ కొట్టి డబ్బులు కట్టాలని చెప్పాడు. ప్రాణం ఉన్న జీవికి టికెట్ తీసుకోవాల్సిందేనని కండక్టర్ చెప్పాడు. దీంతో మహ్మద్ రూ. 30 చెల్లించి బస్సులో కోడిని వెంటబెట్టుకుని ప్రయాణించాడు.
ప్రస్తుతం ఈ వార్త పెద్దపల్లి జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కోడిపుంజుకి టికెట్ తీసుకోవడంపై బస్సు కండక్టర్ మాట్లాడుతూ.. గోదావరిఖని నుంచి ఓ ప్రయాణికుడు బుట్టలో పందెం కోడిని బుట్టలో తీసుకొచ్చాడని తెలిపారు. దానికి కూడా టికెట్టు కొట్టడం జరిగిందన్నారు.
ఈ విషయాన్ని ఓ ప్రయాణికుడు ఫొటోతో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు టాగ్ చేశారు. ఆర్టీసీలో ఇలాంటి రూల్ ఉందా అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ పై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయాన్ని పరిశీలిస్తామని బదులిచ్చారు. 'I will look into this Please' అంటూ స్పందించారు సజ్జనార్.