ఉగ్రరూపం దాల్చిన గోదావరి

Godavari River Water Level Crosses 53 feet at Bhadrachalam. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నదిలోకి వరద పోటెత్తడంతో భద్రాచలం

By Medi Samrat  Published on  11 July 2022 11:54 AM GMT
ఉగ్రరూపం దాల్చిన గోదావరి

గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నదిలోకి వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద అంతకంతకూ నీటిమట్టం పెరుగుతోంది. ఉదయం 9 గంటల సమయంలో 49 అడుగులు దాటిన వరద ఉధృతి ఇప్పుడు 53 అడుగులకు చేరింది. రాత్రి వ‌ర‌కూ మ‌రింత నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 5,91,269 క్యూసెక్కులు ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోందని అధికారులు తెలిపారు. వరద ముంపు ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది విపత్తుల సంస్థ. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని విపత్తుల సంస్థ అధికారులు తెలిపారు. ముందస్తుగా అత్యవసర సహాయక చర్యలకోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. అత్యవసర సాయం, సమాచారం కోసం 1070, 18004250101, 08632377118 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.













Next Story