ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
Godavari rising again, flood alert issued. భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన భారీవ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు
By అంజి
భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన భారీవ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు భద్రాచలం టెంపుల్ టౌన్‌లో విధ్వంసం సృష్టించి, లోతట్టు ప్రాంతాల ప్రజలను నిర్వాసితులను చేసి, వ్యవసాయ పంటలు, ఆస్తులను నాశనం చేశాయి. ఇప్పుడు గోదావరి నది మళ్లీ ప్రమాదకరంగా ఉప్పొంగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 44 అడుగులకు పెరిగింది. నీటిమట్టం మొదటి హెచ్చరిక స్థాయి 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి హెచ్చరిక జారీ చేశారు. వరద పోటెత్తడంతో బుధవారం ఉదయం 5 గంటలకు 49.3 అడుగులుగా ఉన్న నీటిమట్టం 7 గంటల సమయానికి 49.8 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
ప్రాణహిత, ఇంద్రావతి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం త్వరలో 55 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. గోదావరి మరోసారి ఉధృతంగా ప్రవహింస్తుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు భద్రాచలం వద్ద వరద హెచ్చరికలు జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఈ ఏడాది జూలై 15న గరిష్ఠంగా 70.5 అడుగులకు చేరుకుంది. 1986 నుంచి మూడోసారి 70 అడుగుల మార్కును అధిగమించింది. 1986లో ఆగస్టు 16న నీటిమట్టం 75.6 అడుగులకు చేరుకుంది. ఆగస్టు 24, 1990లో కూడా 70.08 అడుగులకు చేరుకుంది.
నది ఒడ్డున ఉన్న లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. అవసరమైతే బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. పలు చోట్ల వాగులు, సరస్సులు, వాగులు, నీటి వనరులు పొంగిపొర్లుతున్నాయన్నారు. ప్రజలు వాటి సమీపంలోకి వెళ్లవద్దని, వాటిని దాటవద్దని ఆయన కోరారు. వరద ముప్పు దృష్ట్యా పశువులను మేత కోసం బయటకు తీసుకెళ్లవద్దని చెప్పారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, సారపాక, అశ్వారావుపేట, పినపాక, ఏడూళ్లబయ్యారం తదితర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ కోరారు.
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు సమీప జిల్లాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. జూలైలో ఎడతెరిపి లేని వర్షాలు, భారీ వరదల కారణంగా వేలాది మంది ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాల్సి వచ్చింది. సీఎం కేసీఆర్ భద్రాచలం పట్టణంలో పర్యటించి ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.1000 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.