ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేదు: బీఆర్ఎస్ నేత

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యాడు.

By Medi Samrat  Published on  20 Feb 2025 4:33 PM IST
ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేదు: బీఆర్ఎస్ నేత

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనుక బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హస్తం ఉందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో గండ్ర వివరణ ఇచ్చారు. రాజలింగమూర్తి హత్యపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. లింగమూర్తిని తానే చంపించానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. హత్యారాజకీయాలను బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రోత్సహించలేదని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని తెలిపారు. ఈ హత్యతో తనకు కానీ, బీఆర్ఎస్ కు కానీ ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో ఆయన్ను నరికి చంపారు. రాజలింగమూర్తి తన స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి తిరిగి వస్తున్నాడు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి ఆయన్ను చుట్టుముట్టారు. కత్తులు, గొడ్డళ్లతో నరికారు. తలకు బలమైన గాయం కూడా అయింది. స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Next Story