కాంగ్రెస్‌కు షాక్.. పార్టీకి గాలి అనిల్ కుమార్ రాజీనామా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.

By Medi Samrat  Published on  15 Nov 2023 4:48 PM IST
కాంగ్రెస్‌కు షాక్.. పార్టీకి గాలి అనిల్ కుమార్ రాజీనామా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీని వీడారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టుగా ప్రకటించారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధి కోసం ఎంత కృషి చేసినా తనకు సరైన గుర్తింపు లభించలేదన్నారు. తాను పార్టీ కోసం పని చేసి అన్ని విధాల నష్టపోయామని రాజీనామా లేఖలో వివరించారు. అనిల్ కుమార్ నర్సాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. అయితే తనకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. తన అనుచరులతో సమావేశం నిర్వహించిన గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ తనతో వ్యవహరించిన తీరుతో తన అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. దీంతో చాలా మంది నా వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారన్నారు అనిల్ కుమార్. కాంగ్రెస్ పార్టీ కోసం చిత్తశుద్దితో పనిచేసిన వారికి పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్నారు. తాను పార్టీ కోసం కష్టపడి పనిచేసి అన్ని విధాలుగా నష్టపోయానన్నారు.

Next Story