ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్‌ను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న గద్దర్‌ను.. అధ్యక్షుల ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని జనరల్ సెక్రెటరీ వి మమతా రెడ్డి ప్రకటన విడుదల చేశారు.
ఇదిలావుంటే.. గద్దర్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తన పార్టీకి 'గద్దర్ ప్రజాపార్టీ' అని నామకరణం చేశారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో ఆయన సమావేశమయ్యారు. గద్దర్ ప్రజా పార్టీ జెండాలో మూడు రంగులు, మధ్యలో పిడికిలి ఉండబోతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా గద్దర్, కార్యదర్శిగా నరేశ్, కోశాధికారిగా గద్దర్ భార్య నాగలక్ష్మి వ్యవహరించబోతున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత గద్దర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది.