కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన గద్దర్‌.. ఎందుకంటే..

Gaddar Meets With Union Minister Kishan Reddy. కేంద్ర ప‌ర్యాట‌క మంత్రి కిషన్‌రెడ్డిని ప్రజాగాయకుడు గద్దర్ సోమ‌వారం నాడు క‌లిశారు.

By Medi Samrat  Published on  23 Aug 2021 5:26 PM IST
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన గద్దర్‌.. ఎందుకంటే..

కేంద్ర ప‌ర్యాట‌క మంత్రి కిషన్‌రెడ్డిని ప్రజాగాయకుడు గద్దర్ సోమ‌వారం నాడు క‌లిశారు. ఈ భేటీలో.. తనపై ఉన్న కేసులను ఎత్తేసాలా చొరవ తీసుకోవాలని కిషన్‌రెడ్డిని గ‌ద్ద‌ర్‌ కోరారు. తాను జనజీవన స్రవంతిలో కలిశాక ఉన్న కేసులను అలాగే కొనసాగించడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా తనపై ఉన్న కేసుల గురించి కిషన్‌రెడ్డితో ఆయన చర్చించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని గద్దర్‌ కోరారు. వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసులపై అమిత్‌షాకు వివరిస్తానని గద్దర్‌ తెలిపారు.

ఇదిలావుంటే.. గతంలోనే తనపై ఉన్న కేసులను ఎత్తివేయడానికి, న్యాయసహాయం అందించడానికి సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకోవాలని గ‌ద్ద‌ర్‌ విజ్ఞప్తి చేశారు. తాను 1990లో అప్పటి ప్రభుత్వ పిలుపు మేరకు నక్సలిజాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిశానని తెలిపారు. 1997 ఏప్రిల్‌ 6న తనపై హత్యాయత్నం జరిగిందని.. వెన్నుపూస దగ్గర ఓ బుల్లెట్‌ ఉందని పేర్కొన్నారు. అది అనేక అనారోగ్య సమస్యలకు కారణమైందని వాపోయారు. అప్పటి నుంచి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటున్నాని.. అలాంటిది తాను పరారీలో ఉన్నానని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.


Next Story