పీహెచ్‌డీ స్టూడెంట్ నుంచి టీచర్ దాకా.. గవర్నర్ కు ఫిర్యాదుల వెల్లువ
From PhD student to school teacher, women air their grievances at TS Guv's Mahila Darbar. తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ జూన్ 10న రాజ్ భవన్‌లో
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Jun 2022 2:48 PM GMTతెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ జూన్ 10న రాజ్ భవన్‌లో 'మహిళా దర్బార్' మొదటి సెషన్‌ను నిర్వహించారు. ఈ సమావేశానికి 300 మందికి పైగా వివిధ వయసుల, వృత్తుల మహిళలు హాజరై తమ సమస్యలను గవర్నర్‌తో చర్చించారు. "మహిళా దర్బార్‌ను నిర్వహించాలనే ఆలోచనకు ముఖ్య కారణం.. తమ సమస్యలు చెప్పుకోలేని వారికి నేను వాయిస్ ఇవ్వగలననే. ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలనేది నా ఉద్దేశ్యం" అని డాక్టర్ సౌందరరాజన్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలందరూ తమ సమస్యలను దరఖాస్తు ఫారమ్‌పై రాతపూర్వకంగా వివరించాలని పిలుపునిచ్చారు. గవర్నర్‌తో కొద్దిసేపు మాట్లాడిన అనంతరం మహిళలు తమ సమస్యలను పరిష్కరించగల సంబంధిత అధికారులు, నిపుణులకు సూచించారు. "అత్యున్నత స్థానాల్లో ఉన్న మహిళలకు గౌరవం లభించడం లేదు కాబట్టి సాధారణ ప్రజానీకం ఎలాంటి కష్టాలు పడుతుందో ఊహించగలను. అందుకే ప్రజలు సాయం కోసం రాజ్‌భవన్ తలుపు తట్టవచ్చు. ఏ మహిళ అయినా సంప్రదించవచ్చు.'' అని గవర్నర్ అన్నారు.
మహిళలు మాట్లాడాలి
రాజ్‌భవన్‌లో రెడ్‌క్రాస్, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, ప్రభుత్వేతర సంస్థలు, ఇతరులతో కూడిన అధికారులు ఆర్థిక సమస్యల నుండి ఆరోగ్య సమస్యలు, వేధింపులు, కార్యాలయ సమస్యల వరకు మహిళల సమస్యలపై దృష్టి సారించారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఓ పీహెచ్‌డీ విద్యార్థిని తన పీహెచ్‌డీని రద్దు చేయడంపై అడ్మినిస్ట్రేషన్ తనకు వివరణ ఇవ్వలేదని వివరించింది. "సాధారణంగా, PhD పూర్తి చేయడానికి కాల పరిమితి 10 సంవత్సరాలు. నేను 2013లో నమోదు చేసుకున్నాను. ఇప్పుడు, చాలా కాలం అయిందని, నా థీసిస్‌ను అంగీకరించడం లేదు," అని ఆమె చెప్పింది.
కరీంనగర్‌కు చెందిన ఒక ఉపాధ్యాయురాలు 5వ తరగతి నుండి విద్యార్థినులందరికీ మార్షల్ ఆర్ట్స్‌ని తప్పనిసరి చేయాలని సూచించారు. "గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్" గురించి పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆమె పట్టుబట్టారు. తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ అధికారులు కూడా అనేక సంవత్సరాలుగా తమ స్వగ్రామాలకు బదిలీల కోసం ఎదురుచూస్తున్న విషయం గవర్నర్ కు చెప్పుకొచ్చారు.
మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారం జరగడంపై ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన మహిళా హక్కుల కార్యకర్త ఎం.అంజలి మాట్లాడుతూ హైదరాబాద్‌లో మరిన్ని మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రెండు స్టేషన్లు మాత్రమే ఉన్నాయని ఆమె విమర్శించారు.
ఇదేమీ రాజకీయ ఎత్తుగడ కాదు, నేను ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నాను: గవర్నర్
మహిళలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ, "మేము అన్ని సమస్యలను పరిష్కరిస్తాము, లైంగిక వేధింపుల బాధితులందరికీ నా మద్దతు ఉంటుంది, నేను తెలంగాణ మహిళల కోసం నిలబడతాను, నేను మహిళల భద్రత, సాధికారత కోసం కృషి చేస్తాను. నన్నెవరూ ఆపలేరు" అని చెప్పుకొచ్చారు. మహిళా దర్బార్ నిర్వహించేందుకు జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు కూడా ఒక కారణమని గవర్నర్ అన్నారు.
జూన్ 4న జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసుపై రెండు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ ఎం. మహేందర్ రెడ్డిలను డాక్టర్ సౌందరరాజన్ ఆదేశించారు. అయితే ఆమెకు ఇంకా నివేదిక అందలేదు. బహుశా, కొంతమందికి గడియారం నెమ్మదిగా తిరుగుతోందని ఆమె అన్నారు. రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ నిర్వహించడం తప్పు అని కొందరు అన్నారు. నేను అలా అనుకోవడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రజల కోసమే. ఇది రాజకీయ చర్య కాదు, ప్రజలకు సహాయం చేయాలని నేను నిజంగా కోరుతున్నాను. ఈరోజు మాకు అందిన మహిళల సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలి'' అని ఆమె అన్నారు.