హైదరాబాద్: నిరుద్యోగ మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉమెన్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా ఈవీ ఆటో, టూ వీలర్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనుంది. 18 నుంచి 45 ఏళ్ల వయస్సున్న మహిళలకు 45 నుంచి 60 రోజుల పాటు శిక్షణ అందించనున్నట్టు పేర్కొంది. డ్రైవింగ్ నేర్చుకున్న మహిళలకు సబ్సిడీపై ఈవీ ఆటోలు అందివ్వనున్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు 45 మందికి ట్రైనింగ్ ఇవ్వగా.. వచ్చే నెల 5 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ కానుంది. మొత్తం 100 మంది ఈవీ ఆటో, టూ వీలర్ నేర్చుకునేందుకు పేర్లు రిజిస్టర్ చేసుకున్నట్టుగా అధికారులు చెబుతున్నారు.
ఒక్కో బ్యాచ్‌కు 30 మంది చొప్పున 15 బ్యాచ్‌ల ద్వారా సుమారు 400 మందికి డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలవారీగా ఆటో, కారు డ్రైవింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి.. మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇస్తామని మంత్రి సీతక్క తెలిపారు. మంగళవారం మధురానగర్‌లోని మహిళా, స్త్రీ సంక్షేమశాఖ కార్యాలయంలో మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. 18 నుంచి 45 ఏళ్లలోపు మహిళల ఉపాధికి చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. జిల్లా కేంద్రాల్లోని మహిళా ప్రాంగణాలను నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా మార్చాలని మంత్రి అధికారులను ఆదేశించారు.