రాష్ట్రంలో వినాయక చవిత, దుర్గాదేవీ నవరాత్రుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగబోయే వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో ఏర్పాటు చేయనున్న గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్ని మండపాలకు ఇది వర్తించనుంది. అదే విధంగా దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు కూడా ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా అందించనుంది. మండపాల నిర్వహణలో ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కాగా మండపాల అనుమతి ఉన్నవారు ఎక్కడి నుంచి విద్యుత్ తీసుకుంటున్నారు అనే వివరాలు సమర్పించాలని సూచించింది. ఈ ఉచిత విద్యుత్ కు సంబంధించిన మొత్తాన్ని ఉత్సవాల అనంతరం ప్రభుత్వం విద్యుత్ శాఖకు చెల్లించనుంది. కాగా గత ఏడాది కూడా మండపాలకు ఉచిత విద్యుత్ అందించారు. ఈనెల 27న వినాయక చవితి కాగా, సెప్టెంబర్ 6 వరకు నవరాత్రి ఉత్సవాలు జరపనున్నారు.