డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో మోసం..రూ.2.50 కోట్లు వసూలు
డబుల్ బెడ్ రూం ఇప్పిస్తానని ఓ వ్యక్తి పేద ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By - Knakam Karthik |
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో మోసం..రూ.2.50 కోట్లు వసూలు
సంగారెడ్డి జిల్లా: డబుల్ బెడ్ రూం ఇప్పిస్తానని ఓ వ్యక్తి పేద ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా సమీపంలో నివాసం ఉంటున్న జోష్ బ్రదర్ అనే మధ్యవర్తి ద్వారా ప్రసన్న కుమార్ అనే వ్యక్తి బాధితులకు పరిచయం అయ్యారు. అమీన్ పూర్ మండలంలో ఉన్న కిష్టారెడ్డిపేట కు చెందిన బీహెచ్ఈఎల్ ఎంప్లాయి ప్రసన్న కుమార్ కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇప్పిస్తానని బాధితులకు కల్లబొల్లి కబుర్లు చెప్పి నమ్మించారు..ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.3 లక్షల నుంచి నాలుగైదు లక్షలు వసూలు చేశాడు. ఇలా మొత్తం 69 మంది వద్ద నుంచి రూ. 2.50 కోట్లకు పైగా మోసం చేశాడు.
జోష్ అనే వ్యక్తి ద్వారా ప్రసన్న కుమార్ పెద్ద మొత్తంలో డబ్బులు దంచుకున్నాడు. 2021 నుంచి నేడు, రేపు ఇళ్ళు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పుతూ బాధితులను మోసం చేస్తూ వస్తున్నాడు. ఆగ్రహం చెందిన బాధితులు... మొదటగా జోష్ ఇంటికి వెళ్లి నిలదీయగా ప్రసన్న కుమార్ కే మొత్తం డబ్బులిచ్చానని తెలిపాడు. దీంతో బాధితులు కిష్టారెడ్డిపేట లోని ప్రసన్న కుమార్ ఇంటికి వెళ్తే వాచ్ మెన్ , కుక్కలతో దాడి చేయించాడు.
ఈ పరిస్థితుల్లో బాధితులు అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి... ఆవేదన వ్యక్తం చేశారు...తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ప్రాధేయ పడుతున్నారు. డబుల్ బెడ్ రూం ఇవ్వకపోయినా సరే... కనీసం తమ డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నారు.ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.