బీఆర్ఎస్‌కు మ‌రో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

పార్లమెంట్ ఎన్నికలవేళ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు

By Medi Samrat  Published on  19 April 2024 4:15 PM IST
బీఆర్ఎస్‌కు మ‌రో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

పార్లమెంట్ ఎన్నికలవేళ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆయన రాజీనామా లేఖను శుక్ర‌వారం పార్టీ అధినేత కేసీఆర్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపారు. 2018 సంవత్సరం ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన రాములు నాయక్ అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్‌పై విజయం సాధించారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం రాములు నాయక్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వైరా టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్‌కు కాకుండా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు కేటాయించారు. టికెట్ రానప్పటికి రాములు నాయక్ అదే పార్టీలో కొనసాగారు.


అయితే కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీపై రాములు నాయక్ అసంతృప్తిగా ఉన్నారు. తనకు నియోజకవర్గ ఇంఛార్జ్‌ వ్యవహారంలో ప్రాధాన్యత కల్పించలేదని ఆగ్రహంతో ఉన్న ఆయ‌న పార్టీని వీడారు. విష‌యం తెలుసుకున్న ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర..ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి బుధవారం రాత్రి ఖమ్మంలోని రాములు నా యక్ ఇంటికి చేరుకుని ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న మాట విన‌లేదు.

Next Story