కాంగ్రెస్ సర్కార్.. తెలంగాణ పరువు తీసింది: సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును, భారతదేశ ప్రతిష్టను మంటగలిపిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకులు సబితా ఇంద్రారెడ్డి ఫైర్‌ అయ్యారు.

By అంజి
Published on : 25 May 2025 11:17 AM IST

Former Minister Sabitha Indra Reddy, Congress government, Telangana, Miss World

కాంగ్రెస్ సర్కార్.. తెలంగాణ పరువు తీసింది: సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును, భారతదేశ ప్రతిష్టను మంటగలిపిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకులు సబితా ఇంద్రారెడ్డి ఫైర్‌ అయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలపై.. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతిథులను ఆనంద పెట్టాలని తమపై ఒత్తిడి తీసుకువచ్చారని తమను వేశ్య లాగా చూశారంటూ ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పోటీల నుంచి మధ్యలోనే తప్పుకుని స్వదేశానికి వెళ్ళిపోయారు.

''అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీల్లో ఇలాంటి ఘటనలు జరగడం.. అది కూడా మన రాష్ట్రంలో జరిగినప్పుడే తెరపైకి రావడం ప్రభుత్వ తీరుపై, నిర్వాహకుల తీరుపై అనేక అనుమానాలను కలిగిస్తోంది. చాలా గ్రాండ్‌గా ఈ వేడుకలు నిర్వహిస్తాం.. పోటీదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తాం.. ఈ పోటీలతో పెట్టుబడులు వస్తాయి. యువత ఉద్యోగాలు వస్తాయి అంటూ ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు... మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలకు సమాధానం ఇవ్వాలి'' అని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు.

''ఇది కేవలం నిర్వాహకులపై చేసిన ఆరోపణ కాదు. మన రాష్ట్ర రాజధానిలో ఈ పోటీలు జరుగుతున్నాయి కాబట్టి ఇది మన రాష్ట్ర ప్రతిష్టకు, మన దేశ పరువు,ప్రతిష్టలకు సంబంధించిన విషయం. దీనిపై వెంటనే విచారణకు ఆదేశించాలి. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన యువతులను వేధించింది ఎవరు..? ఆ వేధింపులకు కారణమైంది ఎవరు? ఆ వ్యక్తులు ఎవరు..? ఈ అంశాలన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉంది'' అని అన్నారు.

దీనిపై వెంటనే రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించి విచారణ చేపట్టాలన్నారు. అలాగే జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని, రాష్ట్ర, దేశ పరువు ప్రతిష్టలను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచ దేశాల నుంచి పోటీల కోసం వచ్చిన యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు.

Next Story