'ప్లేస్, టైం, డేట్ ఫిక్స్ చేయండి'.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
రైతు సంక్షేమంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.
By అంజి
'ప్లేస్, టైం, డేట్ ఫిక్స్ చేయండి'.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
రైతు సంక్షేమంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. 72 గంటలు సమయం ఇస్తున్నామని, ప్రిపేరై రావాలని సూచించారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లెలోనైనా చర్చకు సిద్ధమని తేల్చి చెప్పారు. ప్లేస్, టైం, డేట్ అన్నీ రేవంత్ ఇష్టమన్నారు. బేసిన్‌కు, బేసిక్‌కు తేడా తెలియని రేవంత్.. కేసీఆర్‌ను చర్చకు పిలుస్తారా? అని ప్రశ్నించారు. ఆయన స్థాయికి తాము చాలని సెటైర్లు వేశారు.
బనకచర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ గోదావరి నీటిని తీసుకెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం వంత పాడుతోందని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డికి నదులు, బేసిన్ల గురించి కూడా తెలియదన్నారు. నల్లమల తెలంగాణలోనే ఉందా అని అడుగుతున్నారని, నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తాము ఉద్యమం నడిపితే రేవంత్ వచ్చాక నీళ్లను ఆంధ్రాకు, నిధులను ఢిల్లీకి పంపుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. 'మీ పే సీఎం అందరినీ బట్టలిప్పి కొడితే తప్ప ఇందిరా గాంధీ గొప్పతనం అర్థం కాదంటున్నారు. ప్రజలకు మీరు చేసే సత్కారం ఇదేనా రాహుల్ గాంధీ? తెలంగాణను ఏఐసీసీకి ఏటీఏంగా మార్చినప్పటి నుంచి ఆయన ఏది పడితే అది మాట్లాడటాన్ని అనుమతిస్తున్న మీ విధానాన్ని జనం గమనిస్తూనే ఉన్నారు' అని ట్వీట్ చేశారు.