ఎట్టకేలకు కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జూపల్లి
తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరారు. మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
By అంజి Published on 3 Aug 2023 5:52 AM GMTఎట్టకేలకు కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జూపల్లి
తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నో రోజుల నుంచి సాగుతున్న చేరిక ఎపిసోడ్‌కు ఇవాళ తెరపడింది. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో వీరంతా హస్తం పార్టీలో చేరారు. గురువారం ఉదయం జూపల్లి కృష్ణారావు, గురునాథ్ రెడ్డిని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కొడుకు రాజేశ్ రెడ్డి, ఎంపీపీ మేఘా రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డితో పాటు మరికొందరు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, మల్లు రవి, పొంగులేటి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
మొదటగా ఈ నాయకులు అంతా కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రియాంకా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాలని భావించారు. అయితే భారీ వర్షాల కారణంగా జులై 20,30 తేదీల్లో రెండుసార్లు ప్రియాంక గాంధీ టూర్ వాయిదా పడింది. అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. దీంతో ఇప్పట్లో ప్రియాంక గాంధీ సభ ఉండే అవకాశం లేకుండా పోయింది. దీంతో పార్టీలో చేరిన తర్వాత.. బహిరంగ సభ నిర్వహించుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖర్గే సమక్షంలో నిన్న పార్టీలో చేరాల్సి ఉండగా.. రాష్ట్రపతితో భేటీ కారణంగా ఆయన సమయం కేటాయించలేదు. దీంతో ఈ ఉదయం మల్లికార్జున ఖర్గే.. మాజీ మంత్రి జూపల్లితో ఇతర నేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
2014 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల కాంగ్రెస్ పార్టీని వీడిన జూపల్లి.. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. 2014లో కొల్లాపూర్ అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. 2018 ఎన్నికల్లో కొల్లాపూర్ నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుండి బీఆర్‌ఎస్‌లోకి జంప్ అయ్యారు. అప్పటి నుంచి కొల్లాపూర్ లో బీరం హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వర్గాల మధ్య సఖ్యత లోపించి.. వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన బీఆర్ఎస్ అధిష్ఠానం జూపల్లిపై సస్పెన్షన్ వేటేసింది. దీంతో జూపల్లి కాంగ్రెస్ వైపు చూశారు.