బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. సస్పెండ్ చేసినందుకు తనకు సంతోషంగానే ఉందని.. అయితే తనని సస్పెండ్ చేయడం బీఆర్ఎస్ కే నష్టమని అన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. తమ నియోజకవర్గంలో జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తే తప్పా అని జూపల్లి ప్రశ్నించారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని.. ఇప్పటివరకు తాను ఆడిగిన ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పలేదన్నారు. మంగళవారం నాడు కొల్లపూర్‌లో జూపల్లి ఈ వ్యాఖ్యలు చేశారు.
తనను సస్పెండ్ చేసినా మూడేళ్లుగా తనకు సభ్యత్వం పుస్తకాలే ఇవ్వలేదన్నారు. పార్టీ నుంచి సస్పెండ్‌తో పంజరం నుంచి బయటపడ్డట్టు ఉందన్నారు. నిరంజన్ రెడ్డి.. 88 స్థానాలు వచ్చాక మనం మొనగాళ్ళమే కదా, ఏం అవసరం ఉందని 12 మందిని చేర్చుకున్నారు. ప్రశ్నించే గొంతు వద్దనా.. లేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ముంచాలనా అని ప్రశ్నించారు. ఫ్రీ కరెంట్ ఇవ్వాలని పాదయాత్ర చేశాను.. జైల్‌కు వెళ్ళి వచ్చాను. మా ఇంట్లో వైఎస్సార్ ఫోటో అప్పుడు ఉంది.. ఇప్పుడు ఉంది.. ఎప్పుడూ ఉంటది.. సీఎం కేసీఆర్ ఫోటో కూడా ఉంటదని జూపల్లి కృష్ణారావు అన్నారు.