తెలంగాణలోని గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై స్వయంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు చీఫ్ జస్టిస్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల బీసీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 111 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన విద్యార్థులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి మాటలు కాదు... చేతలు కావాలని స్పష్టం చేశారు.
"గతంలోనూ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగితే, మరోసారి ఇలాంటివి చోటుచేసుకుంటే చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి అన్నారు... మరి ఉయ్యాలవాడ ఘటన ఎలా జరిగింది? సీఎం ఆదేశాలు అధికారులు పాటించడం లేదా? ఢిల్లీకి వెళ్లడానికి దొరికిన సమయం, విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు దొరకదా? ఫుడ్ పాయిజనింగ్ అంశాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టాలి... మానవ హక్కుల కమిషన్, హైకోర్టు వీటిని సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలి... రేవంత్ రెడ్డీ... మాపై కోపం ఉంటే మమ్మల్ని జైల్లో పెట్టండి... అంతేగానీ విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోకండి" అంటూ హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
20 నెలల కాంగ్రెస్ పాలనలో 100 మందికి పైగా గురుకుల విద్యార్థులు మరణించారని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే అధికారులను వెంటనే సస్పెండ్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఏ అధికారిపైనా చర్యలు తీసుకోకపోవడంపై ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని ఆయన తీవ్రంగా విమర్శించారు. అందాల పోటీల సమయంలో ప్లేట్‌కు రూ. లక్షకు పైగా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు సరైన భోజనం అందించడంలో విఫలమైనందుకు ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు.