హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కీలక నేత హరీష్ రావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి. సత్యనారాయణ మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ తదితర బీఆర్‌ఎస్ నేత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హరీష్ రావు ఇంటికి చేరుకుంటున్నారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో గల క్రిన్స్‌విల్లాస్‌లో సత్యనారాయణ పార్థివదేహాన్ని ఉంచారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు మృతి పట్ల సీఎం రేవంత్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. హరీష్ రావు, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.