ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమాల కేసుకు సంబంధించి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. 15 సంవత్సరాల సుదీర్ఘ విచారణ ప్రక్రియ అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి (ఓఎంసీ ఎండీ), గాలి జనార్దన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కె.మెఫజ్ అలీఖాన్, అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వీడీ రాజగోపాల్‌తో పాటు ఓఎంసీ కంపెనీని కూడా న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. వీరందరికీ ఏడేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది.
ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి కృపానందంలను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ఏ1గా బీవీ శ్రీనివాసరెడ్డి, ఏ2గా గాలి జనార్దన్‌రెడ్డి, ఏ3గా వీడీ రాజగోపాల్, ఏ4గా ఓఎంసీ కంపెనీ, ఏ7గా కె.మెఫజ్ అలీఖాన్ దోషులుగా తేలారు. కాగా, ఏ8గా ఉన్న కృపానందం, ఏ9గా ఉన్న సబితా ఇంద్రారెడ్డి నిర్దోషులుగా బయటపడ్డారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఏ5 నిందితుడిగా ఉన్న అటవీశాఖ అధికారి లింగారెడ్డి మరణించారు.