బీఆర్‌ఎస్ చీఫ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రమాదానికి గురయ్యారు. ఇంట్లో కాలు జారి పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు కేసీఆర్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక పరీక్షల్లో కేసీఆర్‌కు తుంటి ఎముక విరిగినట్టు సమాచారం. కేసీఆర్‌కు ఆపరేషణ్ చేయాల్సి రావొచ్చని భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత శస్త్ర చికిత్సపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ నెల 3వ తేదీ నుంచి కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌లో ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ వెలువడిన వెంటనే కేసీఆర్ ప్రగతి భవన్ విడిచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఫాం హౌస్‌లోనే ఉంటున్నారు. బీఆర్‌ఎస్ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఫాంహౌస్‌లోనే భేటీ అయ్యారు. గురువారం స్వగ్రామం చింతమడకకు చెందిన ప్రజలతో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. రాత్రి కేసీఆర్ కాలు జారి పడిపోయినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. కేసీఆర్ ఆస్పత్రిలో చేరడంతో బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు ఆస్పత్రికి తరలి వస్తున్నారు.