బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బీఆర్‌ఎస్‌కు మరో నేత గుడ్ బై చెప్పారు.

By అంజి  Published on  18 Oct 2023 8:00 AM GMT
BRS, Malipeddi Sudhir Reddy, Congress, Telangana Polls

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బీఆర్‌ఎస్‌కు మరో నేత గుడ్ బై చెప్పారు. మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్‌రెడ్డి హస్తం గూటికి చేరారు. టీపీసీసీ ఛీప్‌ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్‌రెడ్డి ఇవాళ ప్రతాపసింగారంలోని సుధీర్‌రెడ్డి నివాసానికి వెళ్లి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగిన సుధీర్‌రెడ్డి

''45 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. ఇంతటి అవినీతి ప్రభుత్వమును ఎప్పుడు చూడలేదు'' అని సుధీర్ రెడ్డి అన్నారు. పాలు అమ్ముతా, పూలు అమ్ముతా అంటున్న మల్లా రెడ్డి మేడ్చల్ నియోజకవర్గాన్ని అవినీతి మయం చేశాడని వ్యంగంగా వ్యాఖ్యానించారు. మేడ్చల్ నుండి మంత్రి మల్లారెడ్డిని తరిమికొడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత తక్కువ సమయంలో తనతో వచ్చిన నాయకులు, కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు

మలిపెద్ది సుధీర్‌ రెడ్డి 2014లో బీఆర్‌ఎస్‌ (అప్పుడు టీఆర్‌ఎస్‌) తరఫున మేడ్చల్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో సుధీర్‌రెడ్డి మళ్లీ సీటు దక్కలేదు. పార్టీ అధిష్టానం అప్పట్లో ఎంపీగా ఉన్న చామకూర మల్లారెడ్డిని మేడ్చల్‌ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మల్లారెడ్డిని ఏకంగా కేబినెట్‌లోకి చేర్చుకున్నారు. ఆ తర్వాత మల్లారెడ్డి సీఎం కేసీఆర్‌కు మరింత దగ్గరయ్యారు. బీఆర్‌ఎస్‌లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.

దీంతో ఐదేళ్ల నుంచి మల్లారెడ్డికి, సుధీర్‌రెడ్డికి ఒకరంటే.. ఒకరికి ఏ మాత్రం పడట్లేదు. ఇరువురు నాయకులు బహిరంగంగానే విమర్శలు చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. సుధీర్‌ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు అప్పట్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చర్చలు జరిపారు. అయితే ఈ సారి అభ్యర్థుల జాబితాలో కూడా తన పేరు రాకపోవడంతో సుధీర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ని వీడాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ అవకాశాన్ని కాంగ్రెస్‌ సద్వినియోగం చేసుకుంది.

మరోవైపు ఉప్పల్‌ కాంగ్రెస్‌ టికెట్ ఆశించి భంగపడ్డ రాగిడి లక్ష్మారెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సాయంత్రం మేడ్చల్‌ సభలో లక్ష్మారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

Next Story