వచ్చే ఏడాదికల్లా.. వరంగల్‌కు విమానం వచ్చేనా.!

For the establishment of airports Priority of Telangana government. తెలంగాణలో తాజాగా ప్రాంతీయ ఎయిర్‌పోర్టుల అంశం తెరపైకి వచ్చింది. తొలిదశలో మూడు ప్రాంతీయ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రాధాన్యం

By అంజి  Published on  15 Nov 2021 7:15 AM GMT
వచ్చే ఏడాదికల్లా.. వరంగల్‌కు విమానం వచ్చేనా.!

తెలంగాణలో తాజాగా ప్రాంతీయ ఎయిర్‌పోర్టుల అంశం తెరపైకి వచ్చింది. తొలిదశలో మూడు ప్రాంతీయ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని సర్కార్‌ నిర్ణయించింది. వాటిని కార్యరూపంలోకి తీసుకువచ్చే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే ఈ నెలాఖరులోగా తుది నివేదిక ఇవ్వాలని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ మాత్రమే ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉడాన్‌ పథకం కింద రాష్ట్రంలో ఎయిర్‌పోర్టులను నిర్మించనున్నారు. మొత్తంగా 6 ప్రాంతీయ ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

వరంగల్‌లోని మామునూరు, నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, పెద్దపల్లిలోని బసంత్‌నగర్‌లలో తొలిదశలో ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై దృష్టి పెట్టింది. తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత ఇండస్ట్రీయల్‌, ఐటీ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న రాష్ట్ర రెండో రాజధాని వరంగల్‌ నగరంలో ఎయిర్‌పోర్టును యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం కల్లా వరంగల్‌లో విమానాలు నడపాలని సర్కార్‌ భావిస్తోంది. రన్‌వేకు అవసరమైన ఎయిర్‌ స్ట్రిప్స్‌ మామునూరు, బసంత్‌నగర్‌లలో ఉన్నా.. వినియోగం లేకపోవడం దెబ్బతిన్నాయి. ఇక నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లిలో కొత్త ఎయిర్‌పోర్టును నిర్మించాల్సి ఉంది. తొలి దశ ఎయిర్‌పోర్టుల నిర్మాణం జరిగిన తర్వాత.. రెండో దశలో ఆదిలాబాద్‌లోని ఖానాపూర్‌, భద్రాద్రి కొత్తగూడెంలోని గొల్లగూడెం - పేటచెరువు, మహబూబ్‌నగర్‌లోని గుడిబండలో ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు నివేదికలు ఇవ్వాలని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాను కోరింది.

గతంలో ఈ ఆరు ఎయిర్‌పోర్టులకు సంబంధించి ప్రాథమిన నివేదికను ఏఏఐ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో రద్దీ అంతగా ఉండదని, దశల వారీగా వాటిని విస్తరించాలని, అలాగే అంచనా వ్యయాలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఒక్క ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రూ.450 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ నుండి నివేదిక వచ్చాన సీఎం కేసీఆర్‌కు వివరించి నిధులు కోరాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఏఏఐ నుంచి ఆశించినంత వేగంగా స్పందన రాకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం కొంత అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story