బాలికల వసతి గృహంలో అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న విద్యార్థినులు ఒక్కొక్కరుగా అస్వస్థత బారిన పడ్డారు. దీంతో వారిని లారీలో ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగింది. గురువారం సాయంత్రం ఆరుగురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. వారు ఉపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ, కడుపు నొప్పితో రోదించారు. దీంతో హాస్టల్ సిబ్బంది వారిని స్థానికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
అంతలోనే హాస్టల్‌లో అస్వస్థతకు గురైన విద్యార్థినుల సంఖ్య క్రమంగా పెరిగింది. రాత్రి 7గంటలకు ఒక్కొక్కరుగా విరేచనాలు, వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారు. దీంతో విద్యార్థి నాయకులు, స్థానికులు.. కొందరు విద్యార్థినులను మూడు అంబులెన్స్‌లలో రెండు విడతలుగా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు హాస్టల్‌లోని అస్వస్థతకు గురైన విద్యార్థినుల సంఖ్య పెరగడంతో విద్యార్థినిలు ఆందోళనకు గురయ్యారు.
హాస్టల్‌లోని 150 మంది విద్యార్థినులను నాలుగు ఆటోలు, ఒక లారీలో ఆస్పత్రికి తరిలంచారు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 15 మందికి ఆక్సిజన్ అందిస్తూ వైద్యం చేస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని వెంటనే నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. కాగా విద్యార్థినుల అస్వస్థతకు కలుషితాహారమే కారణం అని, ఇందుకు హాస్టల్ వార్డెనే బాధ్యురాలని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.