న్యాయవ్యవస్థ బలోపేతానికి కేసీఆర్ కృషిచేస్తున్నారు : సీజేఐ
Focusing on filling up vacancies of judges, infrastructure. న్యాయవ్యవస్థపై భారం ఎక్కువగా ఉందని.. న్యాయమూర్తుల ఖాళీల భర్తీ చేయాడానికి తాను ప్రాధాన్యత
By Medi Samrat
న్యాయవ్యవస్థపై భారం ఎక్కువగా ఉందని.. న్యాయమూర్తుల ఖాళీల భర్తీ చేయాడానికి తాను ప్రాధాన్యత ఇస్తున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ శుక్రవారం అన్నారు. కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని.. న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నానని ఆయన అన్నారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రెండు అంశాలను తాను పరిష్కరించాలని అనుకుంటూ ఉన్నానని చెప్పారు.
తెలంగాణ స్టేట్ జ్యూడీషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ సదస్సు హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగింది. ఈ సదస్సుకు సీజేఐ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న జడ్జీల పెంపు ఎట్టకేలకు పూర్తయిందని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. ఎక్కువమంది జడ్జీలను నియమించి న్యాయవ్యవస్థను బలపరచాలని భావించామని అన్నారు. గత రెండేళ్లలో ఎక్కువ మంది జడ్జీల నియామకం జరిగిందన్నారు. జిల్లా కోర్టుల్లో జడ్జీల సంఖ్య పెంచుతున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ అన్నివిధాలా సహకరిస్తున్నారన్నారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి కేసీఆర్ కృషిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత న్యాయాధికారుల సమావేశం జరగడం ఇదే తొలిసారని వెల్లడించారు. న్యాయవ్యవస్థను బలపరిచేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు.
హైకోర్టులో ఇటీవల జడ్జీల సంఖ్య పెంచామని చెప్పారు. కేసుల త్వరితగతిన పరిష్కారానికి జడ్జిల పెంపు అవసరమన్నారు. చేతికి ఎముక లేదనడానికి ట్రేడ్‌మార్క్ సీఎం కేసీఆర్ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని కేంద్రం, ఇతర రాష్ట్రాలు భావిస్తుంటాయని, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ 4320కిపైగా ఉద్యోగాలు సృష్టించారన్నారు.
"న్యాయస్థానాలు మరియు మౌలిక సదుపాయాలను మేము తగినంత సంఖ్యలో అందించినప్పుడు మాత్రమే న్యాయం సాధ్యమవుతుంది," అని ఆయన అన్నారు. ''మన న్యాయవ్యవస్థపై భారం ఉంది. ఇది వాస్తవం. కోర్టులలో పెండింగ్ కేసులు పెరిగాయి.. కారణాలు చాలానే ఉన్నాయి. ఒక్కసారి కోర్టుకెళ్లాము. ఫలితం కోసం ఎన్ని సంవత్సరాలు పడుతుంది. ఇది పెద్ద ప్రశ్నార్థకం. దేశంలో అప్పీల్ వ్యవస్థ కారణంగా కేసుల పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతుంది, "అని ఆయన అన్నారు.
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (IAMC)ని ఏర్పాటు చేయాలనే తన కలను సాకారం చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ని CJI అభినందించారు. హైదరాబాద్‌లో ఉన్న అనేక గ్లోబల్ కంపెనీలతో కేంద్రం వివాదాలను త్వరగా పరిష్కరించేలా చూస్తుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్లు వస్తున్నాయని, హైదరాబాద్‌లోని ఐఏఎంసీ బలపడగానే ఇతర రాష్ట్రాల్లో ఫ్రాంచైజీ కేంద్రాలు ఏర్పాటు చేయవచ్చని సూచించారు.