తెలంగాణలోని భద్రాద్రి జిల్లా దుమ్మగూడెం వద్ద గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతూ ఉంది. గురువారం ఉదయం 9 గంటలకు గోదావరి నది 53.04 మీటర్ల స్థాయిలో ప్రవహిస్తోందని.. నది ఉద్ధృతంగా ప్రవహిస్తోందని తెలిపారు. వరద పరిస్థితి పెరగడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వచ్చే 24 గంటల పాటు పసుపు హెచ్చరిక అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.
భద్రాచలం వద్ద క్రమంగా మళ్లీ నీటి మట్టం పెరుగుతోంది. బుధవారం ఉధృతి తగ్గి 46.4 అడుగులకు చేరుకోవడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. గురువారం ఉదయం 11 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నది వద్ద నీటిమట్టం 47.50 అడుగులకు చేరడంతో 11,19,275 క్యూసెక్కుల డిశ్చార్జి రేటు నమోదైంది. దీంతో మొదటి హెచ్చరిక స్థాయిని కూడా జారీ చేశారు. భారత వాతావరణ విభాగం మరిన్ని వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురు, శుక్రవారాల్లో పసుపు హెచ్చరికను జారీ చేసింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.