సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెలుతున్న దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైలు చివరి బోగీలో మంటలు చెలరేగాయి. శనివారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఘట్‌కేసర్-పగిడిపల్లి మధ్య బోగీలో మంటలు చెలరేగాయి. విషయాన్ని గమనించిన సిబ్బంది డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. వెంటనే డ్రైవర్ రైలును నిలిపివేశారు. ఇది లగేజీ భోగీ అని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పార్శిల్ బోగీలో ఉన్న సరుకు అంతా దగ్ధమయింది.
పార్శిల్ బోగీకి మంటలు అంటుకోవడంతో మిగిలిన బోగీల్లో ఉన్న ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న వెంటనే సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. సమీప ప్రాంతాల నుంచి అగ్ని మాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.