హైదరాబాద్‌లో తప్పిన మరో ముప్పు..53 మంది సురక్షితం

మైలార్‌దేవ్‌పల్లిలో మరో అగ్నిప్రమాదం జరిగింది.

By Knakam Karthik
Published on : 18 May 2025 6:56 PM IST

Crime News, Hyderabad News, Mailardevpally, Massive Fire Accident,

హైదరాబాద్‌లో తప్పిన మరో ముప్పు..53 మంది సురక్షితం

హైదరాబాద్‌లో ఆదివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన భారీ అగ్నిప్రమాదాలు సిటీ వాసులను భయభ్రాంతులకు గురి చేశాయి. చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్‌లో జరిగిన దుర్ఘటనలో 17 మంది సజీవదహనం అయిన ఘటన మరువక ముందే.. మైలార్‌దేవ్‌పల్లిలో మరో అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడ ఓ మూడంతస్తుల బిల్డింగ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కాగా ప్రమాద సమయంలో బిల్డింగ్‌లో 53 మంది ఉన్నారు. భవనం నుంచి కిందకు దిగే ప్రధాన మెట్ల మార్గం వద్దే భారీగా మంటలు ఎగిసిపడటంతో వారంతా పై అంతస్తుల్లోనే చిక్కుకుపోయారు. ప్రాణభయంతో డాబాపైకి ఎక్కి ఆర్త నాదాలు చేశారు.

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి, లాడర్ల సహాయంతో టెర్రస్‌పై ఉన్నవారిని సురక్షితంగా కిందకు దించారు. రెండో అంతస్తులో చిక్కుకున్న మరికొందరిని మెట్ల మార్గం ద్వారా కిందకు తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి, భవనంలో చిక్కుకున్న మొత్తం 53 మందిని ప్రాణాలతో కాపాడారు. వీరిలో 20 మంది చిన్నపిల్లలు కూడా ఉండటం గమనార్హం. సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పిందని, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Next Story