జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టులో వాదనలు ముగిశాయి. కాగా.. కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. జానీ మాస్టర్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం పరారీలో ఉన్న జానీ మాస్టర్ ను ఈనెల 19వ తేదీన గోవాలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించి రంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో జానీ మాస్టర్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే జానీ మాస్టర్‌ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నార్సింగి పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలావుండగా.. జానీ మాస్టర్ బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు రంగారెడ్డి కోర్టులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ జరిగింది. వాదనలు పూర్తి అయిన అనంతరం కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది. అదేవిధంగా జానీ మాస్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కూడా రేపు కోర్టులో వాదనలు జరగనున్నాయి.