మూడేళ్ల కుమారైను చితకబాదిన తండ్రి.. మండిపడుతున్న నెటీజన్లు
Father beats three year old daughter in Medak.ఇటీవల కాలంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై పోతున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 21 Sept 2021 12:00 PM IST
ఇటీవల కాలంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై పోతున్నాయి. చిన్నారులపై తల్లిదండ్రులు శ్రద్ద వహించడం లేదు. తమదారి తమదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పిల్లలు కాస్త అల్లరి చేస్తే చాలు.. వారిపట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి గొడ్డును బాదినట్లు బాదుతున్నారు. ఓ తండ్రి నాలుగేళ్ల చిన్నారిని దారుణంగా కొట్టాడు. అన్నం తినను అని ఆ చిన్నారి మారాం చేయడమే అందుకు కారణం. చిన్నారిని పైకి లేపి కింద పడవేశాడు. ఇంత జరుగుతున్నా సదరు మాతృమూర్తి.. భర్తను ఆపే ప్రయత్నం చేయకపోగా.. చిరునవ్వులు చిందించడం కొసమెరుపు. ఈ అమానుష ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో జరిగింది.
మెదక్ మున్సిపాలిటీలో పరిధిలో మేడిశెట్టి నాగరాజు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. మూడేళ్ల కుమారై గగనశ్రీ.. తల్లి అన్నం తినిపించేందుకు యత్నించగా.. తినని మారాం చేసింది. దీంతో నాగరాజు కోపంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న తాడుతో పాపను ఇష్టారీతిన కొట్టాడు. అంతటితో ఆగలేదు. ఆ చిన్నారిని ఓ చేతితో గాల్లోకి లేపి.. పై నుంచి కిందపడేసి మరీ కొట్టాడు. చిన్నారిని భర్త కొడుతున్నప్పటికి.. అతడి ఆపేందుకు ఆ భార్య ప్రయత్నించక పోగా.. చిరునవ్వులు చిందించడం విస్మయానికి గురి చేసింది. ఈ తతంగాన్ని మొత్తాన్ని పొరుగింటిలో ఉండే వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటీజన్లు నాగరాజుపై దుమ్మెత్తిపోస్తున్నారు. చిన్నారిని ఇష్టారీతిన కొడుతున్న అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.