కొడుకు అల్లరి చేస్తున్నాడని గోనె సంచిలో కట్టి చెరువులో పడేసిన తండ్రి

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఓ తండ్రి దారుణంగా ప్రవర్తించాడు.

By Srikanth Gundamalla  Published on  1 Aug 2024 1:30 PM IST
father, attack, seven years son,  Telangana ,

 కొడుకు అల్లరి చేస్తున్నాడని గోనె సంచిలో కట్టి చెరువులో పడేసిన తండ్రి

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఓ తండ్రి దారుణంగా ప్రవర్తించాడు. ఏడేళ్ల కొడుకు చెబితే మాట వినడం లేదనీ.. చదువు కూడా సరిగ్గా చదువుకోవడం లేదని ఆగ్రహంతో ఊగిపోయి కర్కశంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత గోనె సంచిలో వేసి..మూటకట్టి చెరువులో వేశాడు. అయితే.. చివరకు స్థానికులు చూడటంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. కొల్లాపూర్ పట్టణంలో 8 ఏళ్ల కొడుకు సరిగ్గా చదువు కోవడం లేదనీ.. చెప్పిన మాట వినడం లేదన్న కోపంతో కన్న తండ్రి విక్షణ కోల్పోయి చితక కొట్టాడు. అంతటితో ఆగకుండా కట్టలు తెగిన కోపంతో గోనె సంచిలో మూటకట్టి ఎవ్వరి కంట్లో పడకుండా తన ఆటోలోనే డ్రైవింగ్ చేస్తూ కొల్లాపూర్ పట్టణ సమీపంలోని మలపురాజు కుంట చెరువు నీటిలో బుధవారం సాయంత్రం పడేశాడు. బాలుడు అందులో నుంచి బయటకు రాకుండా కాళ్లు చేతులు కూడా కట్టేశాడు.

బాలుడు ఉన్న గోనెసంచి మూటను సదరు వ్యక్తి నీటిలో వేసి కాళ్లతో తొక్కడం మొదలుపెట్టాడు. ఇక బాలుడు దానికి గట్టిగా ఏడవడం మొఆదలు పెట్టాడు.ఈ శబ్దం ఆ చుట్టు పక్కల వారికి చెవిలో పడింది. చెరువులో ఏదో జరుగుతుందన్న అనుమానంతో 100కు ఫోన్ చేసి అక్కడే ఉండిపోయారు. ఇంతలోనే సంఘటనా స్థలానికి కొల్లాపూర్ ఎస్సై హృషికేశ్ తన సిబ్బందితో హుటాహుటిన చేరుకున్నారు. అప్పటికే తండ్రి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత బాలుడిని గోనె సంచిలో నుంచి పోలీసులు బయటకు తీశారు. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. ఆ తర్వాత స్టేషన్‌కు తీసుకెళ్లారు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. పిల్లలపై ఇలాంటి దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Next Story