కామారెడ్డిలో విషాదం.. ధాన్యం కుప్పపైనే ఆగిన రైతు గుండె.!

Farmer died at grain purchasing center in kamareddy district. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఓ రైతు మృతి చెందాడు. కొనుగోలు కేంద్రం వద్ద తన

By అంజి  Published on  5 Nov 2021 7:55 PM IST
కామారెడ్డిలో విషాదం.. ధాన్యం కుప్పపైనే ఆగిన రైతు గుండె.!

కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఓ రైతు మృతి చెందాడు. కొనుగోలు కేంద్రం వద్ద తన ధాన్యం కుప్ప పోసిన రైతు బీరయ్య.. అక్కడే నిద్రించాడు. తెల్లవారు జామున తోటి రైతులు చూసే సరికి చనిపోయి ఉన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఐలాపూర్‌ గ్రామానికి చెందిన రైతు బీరయ్య (57) తనకున్న సొంత ఎకరం భూమితో పాటు మరో 3 ఎకరాలు భూమిని కౌలుకు తీసుకున్నాడు. అందులో వరి సాగు చేశాడు. ఇటీవల వరి కోత పూర్తైంది. దీంతో వరి ధాన్యాన్ని అక్టోబర్‌ 27న లింగంపేట ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చాడు. ధాన్యం తీసుకువచ్చిన రోజే రైతు బీరయ్య సీరియల్‌ నంబర్‌ను రాసుకున్నారు. అతని ధాన్యం కొనుగోలుకు 70వ నంబర్‌ వచ్చింది. ఇటీవలే లింగంపేట కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించారు.

నిన్న, ఇవాళ దీపావళి పండుగ, మొన్న వర్షం కారణంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటా వేయలేదు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన రోజు నుండి రైతు బీరయ్య రాత్రి, పగలు కాపలా ఉండాల్సి వచ్చింది. రైతు బీరయ్యతో పాటు మరికొందరు రైతులు కూడా అక్కడే నిద్రిస్తున్నారు. ధాన్యం కాంటా వేసేందుకు ఒక్కో రైతు 20 రోజులుగా వేచి చూడాల్సి వస్తోంది. లింగంపేటలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి 207 మంది రైతులు తమ ధాన్యం అమ్మకానికి తీసుకువచ్చారు. కొనుగోలు ప్రారంభించి వారం రోజులు అవుతున్న 23 మంది రైతుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. రెండ్రోజులగా వర్షాలు, మూడు రోజులుగా కొనుగోలు ఆపేయడంతో రైతు బీరయ్య మానసికంగా ఆందోళన చెంది చనిపోయి ఉంటాడని రైతులు భావిస్తున్నారు. కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story