పిల్లల కిడ్నాప్ కు సంబంధించిన వార్తలు.. స్పందించిన పోలీసులు

తెలంగాణ రాష్ట్రంలో పిల్లలను కిడ్నాప్ చేయడానికి కొన్ని బ్యాచ్ లు దిగాయంటూ ప్రచారం జరుగుతూ ఉంది.

By Medi Samrat  Published on  11 Feb 2024 4:00 AM GMT
పిల్లల కిడ్నాప్ కు సంబంధించిన వార్తలు.. స్పందించిన పోలీసులు

తెలంగాణ రాష్ట్రంలో పిల్లలను కిడ్నాప్ చేయడానికి కొన్ని బ్యాచ్ లు దిగాయంటూ ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అధికారులు తేల్చి చెప్పారు. హనుమకొండ, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్ సహా పలు జిల్లాల్లో పిల్లల కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయన్న వదంతులు ఊహించని విధంగా వైరల్ అయ్యాయి. తల్లిదండ్రులతో పాటు పిల్లలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఓ క్లారిటీ ఇచ్చారు.

చిన్నారుల అపహరణ, కిడ్నాప్ ముఠాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలన్నీ అవాస్తవమని పోలీసులు తేల్చారు. ఇలాంటి వదంతులను ప్రజలు ఎవరూ నమ్మవద్దని కోరారు. ఇలాంటి వదంతులను వ్యాప్తి చేసే వ్యక్తులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కామారెడ్డిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆరుగురిని కాలనీవాసులు గుర్తించగా వారిలో నలుగురు పరారయ్యారు. మరో ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరు పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో కొన్ని పాత వీడియోలు కూడా ఉన్నాయని పోలీసులు వివరించారు.

అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేసి పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712685070కు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. భయపడకండి.. మీకు అండగా మేము ఉన్నామని పోలీసులు తెలిపారు. వదంతులను మాత్రం నమ్మకండని పోలీసులు తేల్చి చెప్పారు.

Next Story