హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. యూనివర్సిటీ భూములను వేలం వేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీగా వచ్చి నిరసనలు చేపట్టారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా స్టూడెంట్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. పోలీసులు మమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నారని, హెచ్‌సీయూ యూనివర్సిటీలోని 400 ఎకరాల్లో జేసీబీలు పెట్టి చెట్లు, రాళ్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకొని యూనివర్సిటీకి వెళ్తే భారీగా పోలీసులు మోహరించి మమ్మల్ని అరెస్ట్ చేశారని అన్నారు. మమ్మల్ని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లకుండా, ఎక్కడికో తీసుకెళ్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. కాగా, అదుపులోకి తీసుకున్న విద్యార్థులను మాదాపూర్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా యూనివర్సిటీ భూములను వేలం వేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తున్నాయి.