గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో కార్యాలయం ముట్టడికి యత్నిస్తున్న కార్యకర్తలు, విద్యార్థి నాయకులు గాంధీభవన్ వద్ద సమావేశం అయ్యారు. అనంతరం వారు గాంధీభవన్ గేట్ల నుంచి దూకి టీఎస్పీఎస్సీ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. అయితే అప్పటికే వందలాదిగా మోహరించిన పోలీసులు విద్యార్ధులను, కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో గాంధీభవన్, టీఎస్పీఎస్సీ పరిసర ప్రాంతాలు రణరంగంగా మారాయి.
ఉద్యోగ నోటిఫికేషన్లపై ప్రకటన చేసి కార్యచరణ ప్రకటించలేదని.. వెంటనే ఉద్యోగాల ప్రకటన చేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ముందస్తు ఎన్నికల కోసమే ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. సుమారు వెయ్యి మంది ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు గాంధీభవన్ నుండి బయలుదేరి టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. గేట్లు దూకి బారికేడ్లను, ముళ్ల కంచెలు లెక్కచేయకుండా టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించడానికి యత్నించారు. దీంతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసులు పలు స్టేషన్ లకు తరలించారు.