గజగజ.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చలి
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. గత నెల నుంచే చలి తీవ్రత విపరీతంగా మొదలైన విషయం తెలిసిందే.
By అంజి Published on 11 Dec 2024 1:41 AM GMTగజగజ.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చలి
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. గత నెల నుంచే చలి తీవ్రత విపరీతంగా మొదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. తెలంగాణలోనూ మోస్తరు వానలు, ఆకాశం మబ్బు పట్టడం వల్ల చలి బాగా తగ్గింది. కానీ గత రెండు రోజులుగా చలి మళ్లీ పెరిగింది. రానున్న రోజుల్లో మరింత తీవ్రం కానుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పొగమంచు కురుస్తుండటంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నాయి.
అటు మన్యంలోని ప్రకృతి అందాలు మరింత సుందరంగా దర్శనమిస్తుండడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. మంగళవారం ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండడంతో జి.మాడుగులలో 13.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అనంతగిరి, అరకులోయ, చింతపల్లిలో 15.8, డుంబ్రిగుడలో 16.1, జీకేవీధిలో 16.2, హుకుంపేటలో 16.3, పెదబయలులో 16.6, ముంచంగిపుట్టులో 16.9 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.వాతావరణంలోని మార్పులతో రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు అంటున్నారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత బాగా పెరిగింది. ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, హర్యాణా, యూపీలో చలి తీవ్రత పెరిగింది.