కేసీఆర్ చర్లపల్లి జైలుకు వెళ్ళక తప్పదు : మాజీమంత్రి పొన్నాల
ExMinister Ponnala Lakshmaiah Fire On CM KCR. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శేష జీవితం చర్లపల్లి జైలులోనే అని.. కేంద్రంలో బిజెపి..
By Medi Samrat Published on 25 Nov 2022 1:45 PM GMTముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శేష జీవితం చర్లపల్లి జైలులోనే అని.. కేంద్రంలో బిజెపి.. రాష్ట్రంలో తెరాసా సర్కార్ కు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖీలాషాపురం గ్రామాల్లో స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మయ్య మాట్లాడుతూ.. రుణమాఫీ పేరుతో కాలం వెళ్లదీస్తున్న కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని.. కుటుంబ పాలనతో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని వాటిపై విచారణ జరిగితే కేసీఆర్ కుటుంబానికి జైలు పాలుకాకా తప్పదని ఆయన అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత కేసిఆర్ కు దక్కింది అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అయిందని ఆయన అన్నారు. కుటుంబ సభ్యులకు పెద్దపీట వేస్తూ వారికి అనుకూలంగా ఉన్న కంపెనీలకే కాంట్రాక్టు ఇస్తూ పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ బంధువులకే పోలీసు వాహనాల కాంట్రాక్టు ఇచ్చిన చరిత్ర ఆయనదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో రాష్ట్రంలో సుస్థిర పాలన అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు.
కేంద్రంలో బిజెపి.. రాష్ట్రంలో టిఆర్ఎస్ సర్కార్‌లు రైతు సమస్యలను గాలికి వదిలి ఇస్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతాంగం పట్ల కాంగ్రెస్ అండగా నిలిచి దశలవారీగా ఉద్యమాలు చేపడతామని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల పక్షాన ఉండేది అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యాయని అన్నారు. రుణమాఫీ పేరుతో మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తక్షణమే ధరణి రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.