తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన భవిష్యత్ కార్యాచరణను ఓ ప్రకటన ద్వారా ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇటీవలే చెప్పానన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీకి నష్టం జరుగుతుందని.. ఇప్పుడే ఆ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని ఆయన కోరారని, ఆయన మాటను గౌరవించి ఎవరికీ చెప్పలేదన్నారు. రానున్న రెండు మూడు నెలల్లో అందరినీ కలుస్తానన్నారు. మన ప్రాంత, రాష్ట్ర దేశ అభివృద్దికి ప్రజల మంచి కోసం అందరితో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
కొత్త పార్టీ పెట్టాలా? లేక మరో పార్టీలో చేరాలా? లేక ఇండిపెండెంట్ గా ఉండాలా? అనే విషయాన్ని అందరితో చర్చిస్తానన్నారు. కాంగ్రెస్ నేతలెవరిపైనా తాను ఒత్తిడి తీసుకురానని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మీ వ్యక్తిగత ఆలోచనలపై తనకు గౌరవం ఉందని.. మీకు ఏది మంచిది అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకోండని చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములు నాయక్ లకు నష్టం జరుగుతుందనే ఇంతవరకు ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదన్నారు. కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు చెబుతున్నానని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు.