షర్మిలపై నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదు : మాజీ ఎమ్మెల్సీ
Ex MLC Rangareddy About Sharmila Party. తెలంగాణలో వైయస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్న సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 15 Feb 2021 6:45 PM ISTతెలంగాణలో వైయస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్న సంగతి తెలిసిందే. భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఆమె జిల్లాల పర్యటన కూడా ప్రారంభంకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను కూడా ఆమె చేపట్టబోతున్నారని తెలుస్తోంది. ఈనెల 21న ఉమ్మడి ఖమ్మం జిల్లా వైఎస్ అభిమానులతో జరగాల్సిన షర్మిల సమావేశం.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడింది. ఈ క్రమంలో హైదరాబాద్ లోటస్పాండ్లోని నివాసంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
ఇవాళ షర్మిలను కలిశారు మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి.. వైఎస్ఆర్ హయాంలో, కిరణ్‌కుమార్ రెడ్డి సమయంలో.. ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన.. షర్మిలతో చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రంగారెడ్డితో పాటు తూడి దేవేందర్ రెడ్డి, సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తిలు షర్మిలతో భేటీ అయ్యారు. షర్మిలతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రంగారెడ్డి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశానన్నారు.. షర్మిలపై కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.. ఇది సరికాదని హితవుపలికిన ఆయన త్వరలో తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకు రావడం ఖాయం అన్నారు.
వైఎస్ కుటుంబ సభ్యులు కూడా తెలంగాణ ప్రాంతానికి ఎన్నో మంచి పనులు చేశారని.. ఔటర్ రింగ్ రోడ్డు వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తుచేశారు రంగారెడ్డి. వైయస్ ఈ లోకంలో లేకపోయినా, వారి పిల్లలు ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నారని కితాబునిచ్చారు. వైయస్ బతికున్నప్పుడు ఆయన కాళ్లు, ఏళ్లు పట్టుకుని తిరిగిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆయనను విమర్శించడం సరికాదని అన్నారు. షర్మిలపై అవాకులు, చెవాకులు మాట్లాడొద్దని తమ పార్టీ నేతలకు సూచిస్తున్నానని చెప్పారు.