త్వ‌ర‌లో టీడీపీలో చేరుతా : మాజీ ఎమ్మెల్యే తీగల

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి త్వరలో టీడీపీలో చేరతానని తెలిపారు.

By Kalasani Durgapraveen  Published on  7 Oct 2024 4:13 PM IST
త్వ‌ర‌లో టీడీపీలో చేరుతా : మాజీ ఎమ్మెల్యే తీగల

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి త్వరలో టీడీపీలో చేరతానని తెలిపారు. పార్టీకి తెలంగాణ లో మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. హైదరాబాద్లో టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో తీగల కృష్ణారెడ్డి కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణలో టీడీపీ నాయకులు, శ్రేణులు, అభిమానులు చాలా మంది ఉన్నారన్నారు.

తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలో టీడీపీలో చేరారు.1986లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపున గాంధీ నగర్ డివిజన్ నుండి కార్పొరేటర్ గా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. కృష్ణారెడ్డి 2002లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి హైదరాబాద్ మేయర్ గా పనిచేశారు. కృష్ణారెడ్డి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో 7,833 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి పై 30,784 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014, అక్టోబరు 29న టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో 9,227 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తీగల కృష్ణారెడ్డి 2023 ఎన్నికల అనంతరం 2024 ఫిబ్రవరి 25న బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Next Story