ఎమ్మెల్యే అని చూడకుండా ఇంత రాక్షసంగా వ్యవహరిస్తారా.?
హుజురాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది
By Medi Samrat Published on 9 Nov 2024 12:53 PM GMTహుజురాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కౌశిక్ రెడ్డి ధర్నా చేపట్టారు. అనుమతి లేకుండా వందలాది ఒక్కసారిగా అంబేడ్కర్ చౌరస్తా వద్దకు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేతో సహా పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
పోలీసుల చర్యను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండవ విడత డబ్బులు విడుదల చేయాలంటూ లబ్దిదారులతో కలిసి ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేస్తున్న ఎమ్మెల్యే ను, లబ్ధిదారులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రైతు బంధుకు రాం రాం, దళిత బందు కి జై భీం అంటారని కేసీఆర్ ముందే చెప్పారన్నారు. ప్రశ్నించిన వారందరి పై కేసులు పెట్టడం దాడులు చేయడమేనా ప్రజా పరిపాలన.? అని ప్రశ్నించారు.
ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి.. మీ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తుందన్నారు. శాసన సభ్యుడు అని చూడకుండా ఇంత రాక్షసంగా వ్యవహరిస్తారా.? ప్రజల చేత ఎన్నుకోబడి, అదే ప్రజల పక్షాన నిలబడిన ఎమ్మెల్యే పైనే మీ కనుసన్నల్లో పోలీసులు దాడులు చేస్తూ, కర్కశంగా వ్యవహరిస్తుంటు ఉంటే ఇక సామాన్య ప్రజలకు మీ పాలనలో రక్షణ ఎక్కడిది అని ప్రశ్నించారు. మీరు ఎన్ని దాడులు చేసిన అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిన ప్రజల పక్షాన BRS పార్టీ పోరాటం. చేస్తూనే ఉంటుందన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసులు వ్యవహరించిన తీరుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి..అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.