దేవుళ్లు గుళ్లు వదిలి పారిపోయే పరిస్థితి వచ్చింది.. సీఎంకు సింగిరెడ్డి కౌంట‌ర్‌

కేసీఆర్ పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేశారనడం సీఎం రేవంత్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

By Kalasani Durgapraveen  Published on  11 Nov 2024 6:01 AM GMT
దేవుళ్లు గుళ్లు వదిలి పారిపోయే పరిస్థితి వచ్చింది.. సీఎంకు సింగిరెడ్డి కౌంట‌ర్‌

కేసీఆర్ పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేశారనడం సీఎం రేవంత్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పాలమూరు జిల్లా పర్యటన సంధర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పాలనపై చేసిన ఆరోపణలపై నిరంజన్ రెడ్డి స్పందిస్తూ.. కాంగ్రెస్ వందల కేసులు వేసినా కుట్రలను చేధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90 శాతం పనులు పూర్తి చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. కేవలం రూ.200 కోట్లు ఇస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఎలక్ట్రికల్ పనులు ముందుకు సాగుతాయి.. పాలమూరు బిడ్డగా చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డికి కనీసం రూ.200 కోట్లు ఇచ్చే తీరిక లేదు.. అధికారంలోకి వచ్చి 339 రోజులు గడుస్తున్నా.. పాలమూరు బిడ్డకు పాలమూరు ప్రాజెక్టుల మీద అర్ధగంట సమీక్ష చేసే తీరిక లేదు.. వట్టెం పంప్ హౌస్ నీట మునిగితే ప్రాజెక్టుల పరీశీలన పేరుతో పర్యటన పెట్టుకున్న కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పంప్ హౌస్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు .. కనీసం సమీక్ష చేయలేదు.. క్రిష్ణా నీళ్లు సముద్రం పాలవుతుంటే కళ్లప్పగించి చూస్తున్నారు.. మీది నిర్లక్ష్యమా ? కేసీఆర్ ది నిర్లక్ష్యమా ? అని ప్ర‌శ్నించారు.

కేవలం 40, 50 రోజులు పట్టుగా పగలు, రాత్రి పనిచేస్తే పాలమూరు ఎత్తిపోతల కింద నిర్మించిన రిజర్వాయర్లలో నీళ్లు నింపుకునే అవకాశం ఉన్నా 11 నెలలుగా ప్రభుత్వం పనులను గాలికి వదిలేసింద‌న్నారు. రైతులు మల్లొచ్చే వానాకాలం వరకు సాగునీళ్లను కోల్పోయినట్లే.. ఇప్పుడు పనులు మొదలుపెట్టినా ఒక ఏడాది పాలమూరు రైతులు సాగునీళ్లు కోల్పోయినట్లేన‌న్నారు. 11 నెలల పాలనలో సీఎం 26 సార్లు ఢిల్లీకి, పలుమార్లు పక్క రాష్ట్రాలకు, మూడు సార్లు విదేశాలకు వెళ్లే తీరిక దొరికింది కానీ పాలమూరు ప్రాజెక్టుల గురించి చర్చించే సమయం లేదా.? అని ప్ర‌శ్నించారు.

మహరాష్ట్ర, కేరళ, యూపీ, ఝార్ఖండ్ రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారానికి తిరగడానికే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయం సరిపోవడం లేదు.. ఇక పాలన మీద, ప్రజల సమస్యల మీద స్పందించే సమయం ఎక్కడ ఉంది.? అని ప్ర‌శ్నించారు. అసలు 11 నెలల పాలనలో ఏం ఒరగబెట్టారని కాళ్లల్లో కట్టెలు పెట్టొద్దు.. అభివృద్ధికి అడ్డుపడితే మట్టి మనుషుల చెమటలో కొట్టుకుపోతారు అంటూ భారీ డైలాగులు కొడుతున్నారని మండిప‌డ్డారు.

అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్లలో కేసీఆర్ పాలమూరు జిల్లా మీద ప్రత్యేక శ్రద్ద తీసుకుని కాంగ్రెస్ పాలనలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులు పూర్తి చేసి 3.50 లక్షల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారు. రాజీవ్ భీమా కింద 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారు. నెట్టెంపాడు కింద 1.40 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారు. ఆర్డీఎస్ తుమ్మిళ్ల ఎత్తిపోతల కింద 87 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారు. కోయిల్ సాగర్ కింద 38 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారు. దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులగా మర్చి10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించారు కేసీఆర్. 12.30 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాలనే ఆలోచనతో కేసీఆర్ ఎన్ని అడ్డంకులు ఎదురైనా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 పూర్తి చేస్తే .. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 11 నెలలుగా ప్రభుత్వం ఆ ప్రాజెక్టు పనులను పెండింగులో పెట్టిందన్నారు.

అంబలి కేంద్రాలకు నెలవు అయిన పాలమూరును అన్నపూర్ణను చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. తాగునీటికి తండ్లాడిన పాలమూరులో ఇంటింటికి నల్లాలిచ్చిన ఘనత కేసీఆర్ ది. పాలమూరు జిల్లా వ్యాప్తంగా 100కు పైగా చెక్ డ్యాం లు నిర్మించిన ఘనత కేసీఆర్ ది. ఒకనాడు ఒక్క మెడికల్ కళాశాల లేని పాలమూరు జిల్లాకు ఐదు ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కళాశాలలు, ఏజీబీఎస్సీ కళాశాల, మత్స్య కళాశాల, వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాల, వందల సంఖ్యలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ది .. ఇది కేసీఆర్ నిర్లక్ష్యంగా కనిపిస్తుందా.? అని ప్ర‌శ్నించారు. పేద, దళిత బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ఈ గురుకుల పాఠశాలలు బాటలు వేశాయి .. మీకు చిత్తశుద్ది ఉంటే వాటికి శాశ్వత వసతులు కల్పించాలన్నారు.

కురుమూర్తి స్వామి మీద, జోగుళాంబ అమ్మవారి మీద, మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి మీద ఒట్లు వేసి, ప్రమాణాలు చేసి రుణమాఫీ చేస్తానని మాటతప్పావు.. రేవంత్ రెడ్డి ప్రమాణాలు చూసి దేవుళ్లు గుళ్లు వదిలి పారిపోయే పరిస్థితి వచ్చింది.. ప్రజలకు ప్రమాణాలు, ఇమానాలు అంటే నమ్మకం పోయే పరిస్థితి వచ్చిందన్నారు. వెంటనే నిధులు కేటాయించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామంటే ఎవరు అడ్డుపడుతున్నారు.? రేవంత్ 11 నెలల పాలన ఒట్లు, తిట్లకే సరిపోయిందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు .. సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా రుణం తీర్చుకుంటారన్నారు.

బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఊరికి, ప్రతి తండాకు రహదారులు నిర్మించాం . ప్రతి గల్లీలో సీసీ రహదారులు వేశాం.. మిగిలిపోయినవి ఏమయినా ఉంటే వెంటనే నిధులు విడుదల చేసి పూర్తి చేయండి.. ప్రజలు సంతోషిస్తారన్నారు. 11 నెలల పాలనలో బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రభుత్వ భవనాలు, ప్రాజెక్టులు, రహదారులు, సబ్ స్టేషన్లకు ప్రారంభోత్సవాలు చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పునాది తీసింది లేదు.. పూర్తి చేసింది లేదు.. గత ప్రభుత్వం వివిధ పనుల నిమిత్తం మంజూరు చేసిన నిధులను రద్దు చేశారన్నారు. అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్నదన్నారు. సీఎం నుండి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరూ అవే అబద్దాలు వల్లె వేస్తున్నారన్నారు.

Next Story