దసరా సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లు ప్రకటించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదిగా కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు చేశారు.' పండుగలు వస్తే చాలు ఆర్టీసీ బస్సు ఛార్జీలు అడ్డగోలుగా పెంచి ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమవుతుండటం సిగ్గుచేటు. పల్లె వెలుగు సహా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం.
అదనపు సర్వీసుల పేరిట 50శాతం అదనపు ఛార్జీల దోపిడీ.. ప్రయాణికులకు పెను భారంగా మారుతున్నది. పండుగ సంబురం లేకుండా చేస్తున్నది. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా, రెగ్యులర్ గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు తగిలించి చేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికీ ప్రజాపీడనే అవుతుంది. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమేనా ప్రజా పాలన, ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి?..అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.