ముఖాలు చూపించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు

తెలంగాణ అసెంబ్లీలో నీటి పారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.

By Medi Samrat  Published on  17 Feb 2024 5:15 PM IST
ముఖాలు చూపించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు

తెలంగాణ అసెంబ్లీలో నీటి పారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ అంశంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను అసెంబ్లీ టీవీలో చూపించరా? అని ప్రశ్నించారు. తన ఇంటి నుంచి ఫోన్ చేసి మరీ అడుగుతున్నారని.. నన్ను తప్ప అందర్నీ చూపిస్తున్నారన్నారు. మా ముఖాలు కూడా చూపించకుండా ఇంత అన్యాయమా? అని మండిపడ్డారు. హరీశ్ రావు వ్యాఖ్యలపై స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పందించారు. అలాంటిదేమీ లేదని, అందర్నీ చూపిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అబద్ధాలు చెప్పారని హరీశ్ రావు మండిపడ్డారు. శ్వేతపత్రంలోని తప్పులను చదివి ప్రజలకు వినిపిస్తామన్నారు. గత ప్రభుత్వంపై పదే పదే అబద్ధాలు చెప్పడం ద్వారా అవే నిజమని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అన్నీ అసత్యాలే చెప్పారని హరీశ్ రావు విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకే శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టారని అన్నారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయ్యాయనేది అసత్యమని.. ఈ ప్రాజెక్టులను తామే పూర్తి చేశామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మిడ్ మానేరుకు రూ. 106 కోట్లు ఖర్చు చేస్తే.. తాము వచ్చాక రూ. 775 కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చామని అన్నారు. కావాలనే మేడిగడ్డ ప్రాజెక్ట్ మరమ్మతులను ఆలస్యం చేస్తున్నారని హరీశ్ విమర్శించారు. అవినీతి ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమని తాము ఇప్పటికే చెప్పామని అన్నారు. తమపై ఉన్న కోపంతో ప్రజలను అన్యాయం చేయొద్దని కోరారు.

Next Story