రాష్ట్రంలోని ఒక్కో మహిళకు రూ. 25,000 వేలు బాకీ పడ్డారు : మాజీ మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల హామీల అమలుపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు
By Medi Samrat Published on 17 Oct 2024 9:40 AM GMTకాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల హామీల అమలుపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కేసీఆర్ ఏటా ఇచ్చే బతుకమ్మ చీరలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఎందుకు బంద్ చేసిందన్న దానికి సమాధానం చెప్పకుండా మంత్రి సీతక్క పొంతన లేని వ్యాఖ్యలు చేయడం శోచనీయం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మా ప్రభుత్వం ఏటా రూ. 300 కోట్లతో బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిందని ఒప్పుకున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు.. అయితే అంతకు మించిన ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కల్పించినట్లు భ్రమలు కలిపించే ప్రయత్నం చేయడం హాస్యాస్పదం అన్నారు.
మహిళలకు ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలు అమలు చేయకుండా.. ప్రచారం కోరుకోవడం ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు అలవాటుగా మారిందన్నారు. మహాలక్ష్మి పథకానికి ఈ రాష్ట్రంలోని రేషన్ కార్డు కలిగి ఉన్న 93 లక్షల కుటుంబాలలో 18 ఏళ్లు నిండిన ఒక్క మహిళను అర్హులుగా తీసుకున్నా.. 10 నెలలు గా నెలకు ₹ 2,500 చొప్పున 93 లక్షల మహిళలకు ఒక్కోక్కరికీ ₹25,000 వేలు బాకీ పడ్డారు. అంటే మొత్తం రూ. 23,250 కోట్ల బకాయి.. మహాలక్ష్మి అమలు చేయకుండా మోసం చేయడమే కాకుండా రూ. 3,325 కోట్ల లెక్క చెప్పి, చెల్లించాల్సిన రూ. 23,250 కోట్లు కప్పి పుచ్చారన్నారు.
ఇది కాకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులకు అదనంగా తులం బంగారం ఇస్తామని మాట తప్పారు. రూ. 500 గ్యాస్ పథకం, 200 యూనిట్ల గృహజోతిని కొందరికే పరిమితం చేశారు. హామీల అమలు విషయంలో చేసింది గోరంత, చెప్పుకునేది కొండంత అని విమర్శించారు. ఇక మహిళల గౌరవాన్ని నిలబెడుతున్నట్లు చెప్పిన మీ మాటలు అటుంచితే.. ముందు మహిళల ప్రాణాలు కాపాడాలని, శాంతి భద్రతలు నిర్వహించి వారి భద్రతకు భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.