ఆయన పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి హరీష్ రావు
వనపర్తిలో నిర్వహించిన రైతాంగ, ప్రజా నిరసన సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు
By Kalasani Durgapraveen Published on 29 Oct 2024 9:38 AM GMTవనపర్తిలో నిర్వహించిన రైతాంగ, ప్రజా నిరసన సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదివేల మంది స్వచ్ఛందంగా తరలి రావడం చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద రైతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారనే దానికి నిదర్శనం. కొత్త పథకాలు రాలేదు, పథకాలు బంద్ పెడుతున్నడు. బతుకమ్మ చీరెలు లేవు, కేసీఆర్ కిట్లు లేవు, చెరువుల్లో చేప పిల్లలు లేవు.. బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది కనుక ఆ మాత్రం అయినా చేస్తున్నరు అని అన్నారు.
వరంగల్ డిక్లరేషన్ లో అనేక హామీలు ఇచ్చారు. ఒక్కటైనా అమలు అవుతుందా అని ప్రశ్నించారు. అయితే దేవుని మీద వొట్లు.. అడిగితే తిట్లు. తిట్లతో పాటు కేసులు కూడా ఉన్నాయన్నారు. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ, చంద్రబాబు, వైఎస్ మీద పోరాటం చేసినోళ్ళం అన్నారు. డిసెంబర్ 9, 2023 నాడు రుణమాఫీ చేస్తా అన్నడు చెయ్యలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో పంద్రాగస్టు వరకు చేస్తం అని మాట తప్పారు. ఈయన చెబితే నమ్మరని దేవుళ్ళ మీద వొట్లు వేసిండు. కురుమూర్తి, జోగులాంబ అమ్మవారు, లక్ష్మి నరసింహ స్వామీ మీద వొట్లు వేసి మాట తప్పారు. 45 వేల కోట్లు అని, 29 వేల కోట్లు అని, 17 వేల కోట్లు చేసినట్లు ప్రచారం చేశారు. సగం మందికి కూడా రుణమాఫీ కాలేదన్నారు.
కేసీఆర్ అందరికీ రైతు బంధు ఇస్తే నిబంధనలు పెట్టీ రుణమాఫీ ఎగవేశారన్నారు. పాలకుడు దేవుళ్ళ మీద వొట్లు పెట్టీ మాట తప్పితే రాష్ట్రానికి అరిష్టం అవుతుందని నేను దేవుడి దగ్గరకి వెళ్ళాను.. ప్రజల్ని కాపాడు, పాపాత్ముడిని క్షమించు అని వేడుకున్నా.. దానికి కూడా నా మీద కేసులు పెట్టారు.
మోసం చేసినవు నీ పేరు ఏనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నారు. పది నెలలు అయ్యింది మ్యానిఫెస్టోలో చెప్పినవి అమలు చేయలేదు అంటే బేగం బజార్ పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టారు. బిడ్డా రేవంత్ రెడ్డి.. నువ్వు నా మీద ఎన్ని కేసులు పెట్టినా నీ హామీలు అమలు చేసేదాకా నిన్ను ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాను. బేగం బజార్ కాదు ఏ బజార్ లో కేసులు పెట్టుకుంటవో పెట్టుకో అన్నారు.
మూసి పేరిట లక్షా 50 వేల కోట్లు అంటున్నాడు కానీ రైతులకు రైతు బంధు ఇచ్చేది లేదు. రైతు బంధు ఇవ్వాలంటే ఊకుందామా ఊరికిద్దామా? అన్నారు. రైతు బంధు, రుణమాఫీ, బీమా పేరిట లక్షా 50 కోట్ల రూపాయలు కేసీఆర్ రైతులకు ఇచ్చిండు, కానీ రేవంత్ రెడ్డి రుణమాఫీ అని చెప్పి పచ్చి మోసం చేసిండు అన్నారు.
అన్ని పంటలకు బోనస్ అని చెప్పి, సన్నాలకు అని మాట తప్పాడన్నారు. డెడ్ లైన్, పేపర్ హెడ్ లైన్ మారాయి.. రుణమాఫీ ఒక లైన్ లోకి రాలేదన్నారు. ఒకప్పుడు దీన్ని వలసల వనపర్తి అనేవారు. కేసీఆర్ వల్ల వలసల వనపర్తిని వరికోతల వనపర్తి అయ్యిందన్నారు. ఇంజినీరింగ్ కాలేజి, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజ్ తెచ్చిండు. వనపర్తిని సరస్వతి నిలయం చేసింది నిరంజన్ రెడ్డి పది నెలల కాలంలో వనపర్తిల పైసా పని అయ్యిందా? అన్ని వర్గాలను రోడ్ల మీదకు తెచ్చిండన్నారు. జివో 29 తెచ్చి ఎస్సీ, ఎస్టీ లకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నడు అన్యాయం అంటే పిల్లల ఈపులు పగల కొడుతున్నడు. ప్రజా పాలన అన్నడు. అర్థరాత్రి విద్యార్థులను గొడ్డును కొట్టినట్లు కొట్టిస్తున్నారన్నారు.
స్పెషల్ పోలీసులను తొలగించి ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టారన్నారు. ముఖ్యమంత్రిగా వారి సమస్యలు పరిష్కరించడంలో ఫెయిల్ అయ్యారన్నారు. పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదన్నారు. కరెంట్ బిల్లులు పెంచవద్దని కోట్లడితే పెంచలేదు..బి ఆర్ ఎస్ పోరాటం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ మెడలు వంచి రైతు బంధు ఇప్పిస్తా.మహిళలకి 2500 మహాలక్ష్మి, ఆటో డ్రైవర్లకు, వ్యవసాయ కూలీలకు చెప్పినట్లు హామీలు ఇవ్వాలి.. అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. తెలంగాణ భవన్ లో లీగల్ సెల్ ఏర్పాటు చేశాం అన్నారు. మేము అండగా ఉంటాం.. అతి చేస్తున్న పోలీసుల పేర్లు డెయిరీలో రాస్తున్నాం అన్నారు.