మంత్రి ఈటల రాజేందర్ తమ భూములను కబ్జా చేశారని అచ్చంపేటకు చెందిన రైతులు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదుపై సీఎం సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రి భూ వివాదంపై అధికారులు అచ్చంపేటలో విచారణ చేపట్టారు. ఇంతలో రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు బదిలీ చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ వ్యవహారంపై ఈటల నుండి ఎవరూ ఊహించని స్పందన వచ్చింది. తన శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేసినట్లు తెలిసిందని.. ఇందుకు సంతోషిస్తున్నానని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కోరుకుంటున్నానన్నారు. సీఎంకు శాఖలపై సర్వాధికారాలు ఉంటాయని అన్నారు. ప్లాన్ ప్రకారమే నాపై భూకబ్జా ఆరోపణలు చేశారని.. వాస్తవాలు త్వరలోనే తేలుతాయని ఈటల రాజేందర్ అన్నారు. నా నియోజకవర్గ ప్రజలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఈటల తెలిపారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ శాఖలేని మంత్రిగా ఉన్నారు.