మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారు. ముందుగా గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించిన ఈటెల.. అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈటల స్పీకర్ ఫార్మేట్‌లో తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు.
ఈ సందర్బంగా ఈటెల మాట్లాడుతూ.. 17 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగా అని ఇప్పుడు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తనను రాజీనామ చేయమని ప్రజలే ఆశీర్వదించారన్నారు. టీఆర్ఎస్ బీ ఫామ్ ఇచ్చినా.. గెలిపించింది మాత్రం ప్రజలేనని అన్నారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసి ఉప ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని.. హుజూరాబాద్‌లో కౌరవులకు, పాండవులకు యుద్ధం జరగబోతోందని ఈటల అన్నారు.
ఇదిలావుంటే.. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. 14న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకు సంబంధించి ఈటల వర్గం.. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, తుల ఉమ, మరికొంతమంది నేతలు బీజేపీలో చేరనున్నారు.